గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు మీరేమైనా నష్టపోతున్నారా... సరైన డీల్ పొందడం ఎలా?

గోల్డ్ లోన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

  • రచయిత, దీపక్ మండల్
  • హోదా, బీబీసీ ప్రతినిధి

గోల్డ్ లోన్. అవసరంలో ఆదుకునే సంజీవిని. ఇంట్లో బంగారం ఉంటే డబ్బు అవసరమైనప్పుడు ఆదుకుంటుందనే భరోసా ఉంటుంది. పైగా ఎవరినీ బతమాలాల్సిన పని ఉండదు. బ్యాంకుకు వెళ్ళామా, బంగారాన్ని కుదవ పెట్టామా డబ్బు తెచ్చుకున్నామా అన్నట్టు ఉంటుందీ లోన్.

నిజమే. ఈ లోన్ పొందడానికి మీ దగ్గర బంగారం ఉంటే చాలు. బ్యాంకులు ఇవ్వకపోతే బయట ప్రైవేటు మార్కెట్‌లో బంగారాన్ని కుదవ పెట్టుకుని అప్పులు ఇచ్చే కంపెనీలు, బోలెడు తారసపడతాయి.

కానీ, సమస్య ఏమిటంటే, వీరంతా బంగారానికి తగినంత విలువ కడుతున్నారా, కట్టిన విలువకు తగినంత మొత్తాన్ని రుణంగా ఇస్తున్నారా లేదా అన్నదే. అలాగే, వడ్డీ రేట్లు సరిగా ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవాలి.

గోల్డ్ లోన్ వ్యాపారంలో అనేక అక్రమాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అలర్ట్ అయ్యాయి.

గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు కేంద్ర ఆర్థిఖ శాఖ గుర్తించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్‌లోన్ విధానాలను సమీక్షించుకోవాలని కోరింది.

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల గోల్డ్ లోన్ తీసుకునే ఖాతాదారులు నష్టపోతున్నారు.

బంగారానికి విలువ కట్టే విషయంలోనే అనే కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. బంగారానికి విలువ కట్టడాన్ని లోన్ టు వాల్యూ రేషియో (ఎల్‌టీవీ) అంటారు.

ఈ ఎల్‌టీవీ ఆధారంగానే గరిష్ఠంగా మీ బంగారంపై ఎంత లోన్ వస్తుందనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని 75శాతంగా నిర్థరించింది. అంటే ఎవరైనా లక్షరూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే వారికి 75వేల రూపాయల లోన్ వస్తుందని అర్థం.

గోల్డ్ లోన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

తప్పు ఎక్కడ జరుగుతుంది?

ఖాతాదారులు తాకట్టు పెట్టడానికి తీసుకువచ్చే బంగారానికి కొన్ని కంపెనీలు తక్కువ విలువ కడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచారణలో బయటపడింది.

దీనివల్ల ఖాతాదారులకు తక్కువ మొత్తంలో మాత్రమే లోన్ దొరుకుతోంది. రెండోది వారు ఆ అప్పును తిరిగి తీర్చడం లేకపోతున్నారు. దీంతో కంపెనీలు దీనిని తమకు అనుకూలంగా మలుచుకుని బంగారాన్ని వేలానికి పెడుతున్నాయి.

కొన్ని కంపెనీలు అయితే ఖాతాదారుల బంగారం నాణ్యతపైన కూడా ప్రశ్నలు లేవెనెత్తుతుంటాయి. చాలా సందర్భాలలో 22 కారెట్ల గోల్డ్‌ను 20 లేదా 18 కారెట్ల బంగారంగా నిర్థరిస్తుంటాయి.

దీనివల్ల కూడా ఖాతాదారులకు తమ బంగారం విలువ మేరకు లోన్ దక్కడం లేదు.

‘‘బంగారం బరువు విషయంలో కంపెనీలు అక్రమాలు చేయలేవు. కానీ కారెట్లను తక్కువగా చూపొచ్చు. దీనివల్ల బంగారం విలువ తగ్గిపోయి, వారికి తక్కువ మొత్తంలోనే లోన్ లభిస్తుంది. ఈ విషయంలో కంపెనీలు లాభపడుతున్నాయి’’ అని సెబీ ధృవీకృత పెట్టుబడి సలహాదారు బల్వంత్ జైన్ చెప్పారు.

‘‘గోల్డ్ లోన్ వడ్డీ నిర్ణయం విషయంలో హోమ్‌లోన్ లా గీటురాళ్ళేవీ లేవు. ప్రామాణిక వడ్డీ రేటంటూ లేకపోవడం వల్ల కంపెనీలు అత్యధిక వడ్డీ రేట్లకు బంగారంపై రుణాలు ఇస్తున్నాయి. ఇలా వడ్డీ రేట్లకు ఓ ప్రామాణికత లేకపోవడమే ఈ వ్యవహారంలోని అతిపెద్ద సమస్య’’ అని తెలిపారు బల్వంత్ జైన్.

గోల్డ్ లోన్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బంగారాన్ని సరిగా విలువకట్టేలా చూసుకోవాలి.

వడ్డీరేట్లు, ప్రాసెస్ ఫీ ఎలా లెక్కిస్తారు?

బంగారు ఆభరణాలపై అప్పులు ఇచ్చే చాలా కంపెనీలు తమ ఖాతాదారుల నుంచి అత్యధిక వడ్డీరేట్లు వసూలు చేస్తుంటాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులలో బంగారంపై ఇచ్చే అప్పుకు 8.75 శాతం నుంచి 11 శాతం దాకా వడ్డీ వసూలు చేస్తున్నాయి.

కానీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాత్రం గోల్డ్ లోన్స్ పై 36 శాతం దాకా వడ్డీ వసూలు చేస్తున్నాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు విషయంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య తేడాలు ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును 0.5 శాతం నుంచి గరిష్ఠంగా 5వేల రూపాయలవరకు వసూలు చేస్తున్నాయి.

కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మాత్రం ఒక శాతానికంటే ఎక్కువగానే ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటున్నాయి.

గోల్డ్ లోన్
ఫొటో క్యాప్షన్, బంగారానికి విలువ కట్టడంలోనే అసలు మతలబు దాగుంది

జాగ్రత్త పడటం ఎలా?

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పు తీసుకోవడానికి ముందే బహిరంగ మార్కెట్లో తమ బంగారం నాణ్యతను ఖాతాదారులు పరీక్షించుకోవడం మంచిది.

అనేక బంగారు దుకాణాలలో బంగారం నాణ్యతను నిర్థరించే సౌకర్యం ఉంది. అలాగే మార్కెట్లో బంగారం నాణ్యతను తెలిపే కియోస్క్‌లు కూడా ఉన్నాయి. ఇవి నాణ్యతకు సంబంధించి సర్టిఫికెట్స్ కూడా ఇస్తాయి.

ఇక్కడ గోల్డ్ కారెట్స్ ను కెరటోమీటర్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ టెస్ట్ చేయించి, సర్టిఫికెట్ తీసుకుంటే బ్యాంకుల వద్ద అప్పు తీసుకునేటప్పుడు తమ బంగారం విలువకు తగినట్టుగా బేరమాడే శక్తి వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో కమోడీటీ అండ్ కరెన్సీ హెడ్‌గా ఉన్న అనుజ్ గుప్తా మాట్లాడుతూ ‘‘ కస్టమర్ల వద్ద ఉండే బంగారానికి హాల్ మార్క్ ఉంటే లోన్ తీసుకునేటప్పుడు వారు బేరమాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే గోల్డ్ కారెట్స్ సర్టిఫికెట్ ఉన్నా కంపెనీలు వడ్డీ రేటు తగ్గిస్తాయి’’ అని చెప్పారు.

‘‘గోల్డ్ లోన్ అనేది స్వల్పకాలానికి మాత్రమే తీసుకునే అప్పు అనే విషయాన్ని ఖాతాదారులు మరిచిపోకూడదు. ఇది కేవలం ఓ అత్యవసర లోన్ మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా చెల్లించేయాలి’’ అని తెలిపారు.

‘‘సాధారణంగా హోమ్ లోన్ కంటే గోల్డ్ లోన్ వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని తీర్చగలిగే అవకాశం ఉన్నప్పుడు వెంటనే తీర్చేయడం ఉత్తమం’’ అని చెప్పారు.

గోల్డ్ లోన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గోల్డ్ లోన్ వ్యాపారం ప్రైవేటురంగంలోనే ఎక్కువగా సాగుతోంది

భారీగా గోల్డ్ లోన్ మార్కెట్

ఇండియాలో వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ విలువ 6 లక్షల కోట్లరూపాయని ఆర్‌బీఐ డేటా చెపుతున్నట్టు ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

సెప్టెంబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2022 మధ్యన గోల్డ్ లోన్స్ రెట్టింపయ్యాయి. సెప్టెంబర్ 2020లో 46,791 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ లోన్స్ ఇవ్వగా, సెప్టెంబర్ 2022 నాటికి ఈ మొత్తం 80,617 కోట్లకు పెరిగింది.

దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ ప్రధానంగా వడ్డీ వ్యాపారులు, బంగారు కుదువ వ్యాపారుల వద్దే ఉంది. మార్కెట్‌లో వారి వాటా 65 శాతం. మిగిలిన 35 శాతం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద ఉంది.

ఇంతకుముందు నాన్ బ్యాంకింగ్ కంపెనీలు గోల్డ్‌లోన్ రంగంలో ఆధిపత్యం చూపించేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా క్రమంగా తమ ప్రాముఖ్యం పెంచుకున్నాయి. ఇప్పుడు దాదాపు ప్రతి ప్రభుత్వ బ్యాంక్ గోల్డ్‌లోన్ మార్కెట్లోకి ప్రవేశించింది.

గడిచిన కొన్ని నెలలుగా బ్యాంకులు గోల్డ్ లోన్ విభాగంలో తమ పాత్రను గణనీయంగా పెంచాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసానికి ముందు ఎస్‌బీఐ రీటైల్ గోల్డ్ లోన్ విభాగంలో 21 శాతం పెరుగుదల కనిపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 62 శఆతం పెరుగుదలను నమోదు చేసింది. హెడ్‌ఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు వరుసగా 23, 26 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి.

గోల్డ్ లోన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గోల్డ్ లోన్ ఖాతాలపై దృష్టి సారించమని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

నియంత్రణ అవసరమా?

గోల్డ్ లోన్ విభాగంలో పెరుగుదల కోసం బ్యాంకులు నిబంధనలను పట్టించుకోకుండా లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. తగినంత బంగారం కుదవ పెట్టుకోకుండానే లోన్లు మంజూరు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు టాప్ అప్ లోన్స్ కూడా ఇస్తన్నాయి. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాకా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారంపై ఆర్‌బీఐ నిషేధం విధించింది.

ఐఐఎఫ్ఎల్ లోన్ టు వాల్యు రేషియోలో భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఆర్‌బీఐ తన విచారణలో గుర్తించింది. దాదాపు 67 శాతం ఖాతాలలో ఈ తేడాను గమనించింది.

చాలా కేసులలో లోన్ రికవరీ చేసిన రోజునే తిరిగి లోన్ మంజూరు చేయడమో లేదంటే కొన్నిరోజుల తరువాత లోన్ ఇవ్వడమో చేస్తున్నారు. లోన్ మొత్తానికి తగినంత బంగారం తాకట్టు పెట్టారో లేదా అనే విషయాన్ని పరిశీలించాలని బ్యాంకులను ఆర్‌బీఐ అడిగింది. అలాగే ఆర్‌బీఐ రూల్స్‌కు అనుగుణంగా బంగారం విలువ, నాణ్యత పరిశీలించారో లేదో కూడా నిర్థరించుకోవాలని కోరింది. గత రెండేళ్ళలో క్లోజ్ చేసిన ఖాతాలను పరిశీలించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)