పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు

ధోనీ

ఫొటో సోర్స్, AFP

  • రచయిత, సురేశ్ మేనన్
  • హోదా, స్పోర్ట్స్ రచయిత

15 ఏళ్ల కిందట ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)’ మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 38 ఏళ్ల కెప్టెన్ నేతృత్వం వహించి విజయం దిశగా నడిపించినప్పుడు ఒక మాట ప్రధానంగా వినిపించింది. తన దేశ జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేయని అతిగొప్ప ప్లేయర్‌గా ఆయన్ను పేర్కొనేవారు.

షేన్ వార్న్ తన గురించి ఈ కోణంలో ఆలోచించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అప్పుడు ఆయన ద్విపాత్రాభినయం చేశారు.

వ్యూహకర్తగా, మార్గదర్శిగా ఆయన జట్టును నడిపించారు. కానీ, ఆస్ట్రేలియా ఎన్నడూ ఆయన్ను కెప్టెన్సీ మెటీరియల్‌గా చూడలేదు.

కానీ, ఐపీఎల్ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు.

అదే పట్టుదల, మార్గదర్శకత్వం నేడు ధోనీ కెప్టెన్సీలోనూ కనిపించాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్.. తన 250వ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆన్-ఫీల్డ్ వ్యూహకర్తగా, మార్గదర్శిగా ఆయన జట్టును విజయానికి చేర్చారు.

ఆట గురించి ఆయనకు తెలిసిన పరిజ్ఞానం, జట్టులోని ప్లేయర్లపై తనకున్న అవగాహన రెండింటినీ ఆయన మెరుగ్గా ఉపయోగించుకున్నారు.

స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌ను తన ఎడమ వైపు ఎప్పుడు తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో ప్లేయర్‌తో ఎప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించాలో, ఎప్పుడు చూసీచూడనట్లు ఊరుకోవాలో కూడా ఆయనకు తెలుసు.

మొదట్లోనే డేంజర్ మ్యాన్ శుభమన్ గిల్ క్యాచ్‌ను దీపక్ చాహర్ వదిలేసినప్పుడు ధోనీ అతిగా స్పందించలేదు.

స్టంప్‌ల వెనుక తన స్థానానికి వెళ్లి బౌలర్‌ను ప్రశంసించి ఆయన ఊరుకున్నారు.

ధోనీ

ఫొటో సోర్స్, AFP

41 ఏళ్ల ధోనీ వయసును, 538 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆయన అనుభవాన్ని అందరూ గౌరవించడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ కనిపించదు.

అయితే, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అంతా గౌరవించడం గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి.

స్పోర్ట్స్‌ ఆయనకు చాలా ముఖ్యం. అయితే, ఇదేమీ ఆయనకు జీవన్మరణాల సమస్య కాదు.

మనం తప్పులు చేస్తాం, క్యాచ్‌లను వదిలేస్తాం, ఒక్కోసారి మన వల్ల పక్కవారు అవుట్ అవుతారు.. ఇలాంటివన్నీ స్పోర్ట్స్‌లో సహజం.

అయితే, ఇవే తప్పులు అర్థంపర్థం లేకుండా పదేపదే చేస్తే కెప్టెన్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుమార్టం అనేది తర్వాత నిర్వహించుకోవచ్చు, మ్యాచ్‌ ఆడేటప్పుడు కాదు. ధోనీ కూడా సరిగ్గా అలానే నడుచుకున్నారు.

సీఎస్‌కేకు ధోనీ తొలి టైటిల్ తెచ్చిపెట్టినప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు.

అది ఐపీఎల్ మూడో సీజన్. అంతకు ఏడాది ముందు, 38 ఏళ్ల ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ కప్పును డెక్కన్ చార్జర్స్‌కు తెచ్చిపెట్టారు.

వేగంగా మారుతున్న గేమ్‌ను అన్ని కోణాల్లోనూ చూడగలిగే సీనియర్ ప్లేయర్లకు ఐపీఎల్ లాంటి జట్ల సారథ్య బాధ్యతలను వదిలేయడం మంచిదేనా? లేదా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకునే కొత్త ప్లేయర్లకు ఈ బాధ్యతలను అప్పగించాలా?

షేన్ వార్న్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, షేన్ వార్న్

35 ఏళ్ల తర్వాత కూడా ధోనీ తన జట్టుకు మూడు టైటిల్స్ తెచ్చిపెట్టారు.

టీ20 అనేది యువ ప్లేయర్ల ఆట కావచ్చు. అయితే, ఇక్కడ సీనియర్ కెప్టెన్ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

‘‘దీన్ని కెప్టెన్ కోసం సాధిద్దాం’’ అని ప్లేయర్లు అనుకోవడం, కెప్టెన్ నుంచి స్ఫూర్తి పొందడం, బృంద స్ఫూర్తితో ముందుకు వెళ్లడం లాంటివి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సగటు ప్రతిభను కనబరిచే టీమ్‌లను కూడా ప్లేయర్లను గౌరవిస్తూ, సరైన సందేశాలను ఇస్తూ మంచి కెప్టెన్‌లు విజయాల దిశగా నడిపించగలరు.

‘‘ఈ టైటిల్ ధోనీ కోసం’’ అని గెలుపు అనంతరం రవీంద్ర జడేజా చెప్పారు. చివరి రెండు బంతుల్లో ఆయన కొట్టిన పది రన్లు జట్టుకు విజయం తెచ్చిపెట్టాయి. మరోవైపు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ వ్యాఖ్యల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ‘‘ధోనీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను’’అని గుజరాత్ టైటన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పారు. ‘‘ఆయన చేతిలో ఓడిపోవడం గురించి నేను పెద్దగా ఆలోచించను. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు’’అని పాండ్యా అన్నారు.

అటు వార్న్, ఇటు ధోనీ.. ఇద్దరూ సమయానికి తగినట్లుగా నడుచుకునే కెప్టెన్లు. ప్లేయర్లలో వీరు స్ఫూర్తి నింపుతారు. అవసరమైతే మందలిస్తారు కూడా. వాస్తవానికి రవీంద్ర జడేజాకు ‘‘రాక్‌స్టార్’’ అని పేరు పెట్టింది వార్నే.

ఇది జడేజా ఆల్-రౌండర్ ప్రతిభ కోసం కాదు, వ్యక్తిత్వం కోసం పెట్టినవేరు. ఏదేమైనప్పటికీ ఆ టైటిల్ ఆయనకు సరిపోయింది.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: క్రికెట్‌కు దూరమైన పదేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్న స్నేహ దీప్తి

గొప్ప కెప్టెన్ ఎప్పుడూ ప్లేయర్లు ఏం చేయాలో తెలియజేస్తుంటారు, జట్టును ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడితే బావుంటుంది. అయితే, కెప్టెన్ స్థానంలో మాత్రం రుతురాజ్ గైక్వాడ్ పేరు వినిపిస్తోంది. కానీ, జాతీయ జట్టులో చోటుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆడే సీనియర్ ప్లేయర్ ధోనీ గురించి మనం ఒక మాట కచ్చితంగా చెప్పుకోవాలి.

నాలుగు సీజన్ల తర్వాత ఐపీఎల్‌ నుంచి వార్న్ సెలవుతీసుకున్నాడు. తొలి టైటిల్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఆ మాయను చూపించలేకపోయింది. కాబట్టి చరిత్రను ఎప్పుడూ అదే కోణంలో చూడకూడదు. కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతాయి.

(సురేశ్ మేనన్, రచయిత, కాలమిస్టు)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)