కాస్టింగ్ కౌచ్ : తెలుగు సినీ పరిశ్రమపై వచ్చిన ఆరోపణల సంగతేంటి, నాడు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏమైంది?

టాలీవుడ్ కాస్టింగ్  కౌచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై నాటి తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
  • రచయిత, పద్మ మీనాక్షి
  • హోదా, బీబీసీ కోసం

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి మరొకసారి చర్చ జరుగుతోంది.

కేరళ సినిమా పరిశ్రమ మీద జస్టిస్ హేమ కమిటీ నివేదికను ఇటీవల విడుదల చేశారు. దీని తరువాత నటులు, డైరెక్టర్లు, నిర్మాతల మీద ఆరోపణలు వచ్చాయి.

అసోసియేషన్ ఆఫ్ మలయాళం ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు.

జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో సమంత, మంచు లక్ష్మి వంటి యాక్టర్స్ స్పందిస్తున్నారు.

దీంతో కొన్నేళ్ల కిందట టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు నాటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఏం చేసింది? కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై ఏమైనాచర్యలు తీసుకున్నారా? అనే చర్చ మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాస్టింగ్ కౌచ్

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు ఏం జరిగింది?

హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు టీవీ యాంకర్, నటి శ్రీరెడ్డి ఏప్రిల్ 07, 2018న అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు నిరసనగా అలా చేసినట్లు నాడు ఆమె తెలిపారు.

అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. సినిమా రంగంలో మహిళల పరిస్థితి, వేధింపుల మీద విచారణ జరపాలనే డిమాండ్లు వచ్చాయి. తెలంగాణ సమాచార, ప్రసారశాఖకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.

తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలు, ట్రాన్స్ జెండర్ ఆర్టిస్టుల భద్రత, రక్షణ, సంక్షేమం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ నాటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను విమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది.

మరోవైపు వి.సంధ్యారాణితోపాటు మరికొందరు మహిళా హక్కుల కార్యకర్తలు 2018 సెప్టెంబరులో తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు.

తెలుగు సినిమా రంగంలో పని చేసే మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు.

దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.హోంశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు, మహిళా నటులు ఆ కమిటీలో భాగంగా ఉండాలని చెప్పింది.

దీంతో 2019 ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

నాటి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావును చైర్మన్‌గా నియమించింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ తమకు నివేదిక, సూచనలు సమర్పించేందుకు మరొక సబ్ కమిటీని నియమించింది.

మీటూ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

సబ్ కమిటీ ఏం చేసింది?

సబ్ కమిటీ ఏం చేసింది? సిఫారసులు ఏమైనా చేసిందా? అనే విషయాలపై సబ్ కమిటీ మెంబర్ అయిన సునీతతో బీబీసీ మాట్లాడింది.

‘‘సినిమా, టీవీ , మీడియా, బ్రాడ్ కాస్ట్ రంగంలో పని చేస్తున్న అనేక మంది మహిళలతో, ఉద్యోగులతో సబ్ కమిటీ మాట్లాడింది. వివిధ స్థాయుల్లో పని చేస్తున్న వ్యక్తులతో మాట్లాడేందుకు కనీసం 20 సెషన్లను నిర్వహించింది.’’ అని సునీత వివరించారు.

‘‘ఈ కమిటీ వినోద పరిశ్రమ పనితీరును పరిశీలించింది. కేవలం లైంగిక వివక్ష మాత్రమే కాకుండా, మహిళా ఉద్యోగులు, పని పరిస్థితులు, పని వేళలు, వేతనాల లాంటి అంశాలను పరిశీలించింది. పరిశ్రమలో పని చేసున్న కెమెరా పర్సన్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు అన్ని స్థాయుల ఉద్యోగులతో మాట్లాడాం’’ అని సునీత తెలిపారు.

‘‘సబ్ కమిటీ రూపొందించిన సెక్సువల్ హరాస్‌మెంట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీస్’’ అనే నివేదికను 2022 జూన్ 1న అప్పటి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు సమర్పించాం. కానీ, ఆ నివేదిక ఇప్పటి వరకు విడుదల కాలేదు" అని సునీత చెప్పారు.

సునీత
ఫొటో క్యాప్షన్, తెలుగు సినీ పరిశ్రమలో బలమైన పవర్ స్ట్రక్చర్ ఉందని సునీత చెప్పారు .

నివేదిక సమర్పించాక...

నివేదిక సమర్పించిన తర్వాత ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో మూడు సార్లు ఫాలో అప్ మీటింగ్స్ జరిగినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని ఆమె అన్నారు.

అయితే, నివేదికలోని అంశాలు తాను బయటకు చెప్పలేనని సునీత చెప్పారు.

"తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది దుర్భల స్థితిలో ఉన్నారు. అక్కడ ఒక బలమైన పవర్ స్ట్రక్చర్ ఉంది" అని సునీత అన్నారు.

‘‘సబ్ కమిటీ విచారణకు చిన్న స్థాయి కళాకారులు, ఉద్యోగులు వచ్చి మాట్లాడారు. కానీ పేరున్న లేదా కెరీర్ ప్రారంభంలో ఉన్న వారు ఒక్కరు కూడా కమిటీ ముందుకు వచ్చి మాట్లాడలేదు. పరిశ్రమలో ఇక కెరీర్ వద్దనుకుంటేనే, ముందుకు వచ్చి మాట్లాడతారు. కానీ, కెరీర్‌కి భయపడి చాలా మంది పరిస్థితులకు తల వంచుతారనేది అందరికీ తెలిసిన విషయమే. తాము ఎదుర్కొనే అవమానాలు, బాధలు తమను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తాయని కొందరు కమిటీ ముందు చెప్పారు" అని సునీత అన్నారు.

"'మీటూ' లాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు సమాజం కూడా వాటిని ఒక 'సాఫ్ట్ పోర్న్' లానే చూస్తుంది తప్ప, ప్రశ్నించదు. సినిమా కథ, పాటలు, నటీ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు గురించి అందరూ మాట్లాడతారు కానీ, తెర వెనుక దాగిన చీకటి కోణం గురించి పెద్దగా పట్టించుకోరు, చర్చకు తావివ్వరు, ప్రశ్నించరు" అని చెప్పారు.

‘‘మహిళల భద్రత ముఖ్యం’’

సబ్‌ కమిటీ విచారణకు చిత్ర పరిశ్రమ తరపున హాజరైన వారిలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఒకరు. ఆమెతో బీబీసీ మాట్లాడింది.

హేమ కమిటీ విడుదల చేసిన నివేదికలోని అంశాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని ఆమె అన్నారు.

"మహిళల భద్రత, రక్షణ ప్రతి పరిశ్రమలోనూ అవసరమే. ఇది సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి బాధ్యత. సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ, ప్రభుత్వం, మీడియా కలిసి పని చేయాలి. మహిళల రక్షణ కోసం పటిష్టమైన, ఆచరణాత్మక విధానాలను అమలు చేయాలి" అని సుప్రియ చెప్పారు.

సమంత

ఫొటో సోర్స్, FB/Samantha

సమంత, ఝాన్సీ ఏమన్నారు?

మలయాళ సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ వ్యవహారంపై ప్రముఖ నటి సమంత స్పందించారు. వాయిస్ ఆఫ్ విమెన్ సంస్థ ప్రకటనను ఆమె శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన నివేదికను బయట పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ ప్రకటన కోరింది.

"తెలుగు సినీ పరిశ్రమలోని మహిళలమంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది. ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలకు మద్దతు కోసం 2019లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది" అని ఆ ప్రకటనలో వాయిస్ ఆఫ్ విమెన్ తెలిపింది.

ఝాన్సీ

ఫొటో సోర్స్, Insta/ anchor_jhansi

ఇదే ప్రకటనను యాంకర్ ఝాన్సీ సైతం షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సబ్‌ కమిటీ సమర్పించిన నివేదికను బయట పెట్టాలని కోరారు.

వాయిస్ ఆఫ్ విమెన్

ఫొటో సోర్స్, Instagram/Samantha

చిత్ర పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

నివేదిక ఏమైంది?

సబ్ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు దాటి పోయింది. కానీ ఇంతవరకు ఆ నివేదికను ప్రభుత్వం విడుదల చేయలేదు.

సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన విషయంపై తనకు అవగాహన లేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీకి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీలో ఆయన కూడా ఒక మెంబర్. సబ్‌ కమిటీ విచారణకు హాజరైన సుప్రియ కూడా నివేదికపై అవగాహన లేదని తెలిపారు.

కమిటీ నివేదిక సమర్పించి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదని సబ్ కమిటీ సభ్యురాలు, భూమిక స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి ప్రశ్నించారు.

‘‘రిపోర్ట్ ఇచ్చి రెండేళ్లు దాటింది. నివేదికలోని అంశాలను విడుదల చేయడంతోపాటు సూచనలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్‌ను ఇటీవల కోరాం. బాధితులు ఫిర్యాదు చేయడానికి, పరిష్కరించడానికి ఒక వ్యవస్థీకృత విధానం ఉండాలి’’ అని కొండవీటి సత్యవతి అన్నారు.

సినీ పరిశ్రమలో పని చేసే మహిళలకు తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగంగా పని చేస్తున్న 'వాయిస్ ఆఫ్ విమెన్' ఒక ప్రకటన విడుదల చేసింది.

మహిళలందరికీ సురక్షితమైన, మెరుగైన ఉద్యోగ పరిస్థితులను కల్పించడమే తమ లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్పందన కోసం రాష్ట్ర సమాచార ప్రసార శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. ఫోను చేసినా, మెసేజ్ పెట్టినా వారి నుంచి స్పందన రాలేదు. వారి స్పందన రాగానే ప్రచురిస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)