'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ

international sex workers day
  • రచయిత, తులసీప్రసాద్ రెడ్డి నంగా
  • హోదా, బీబీసీ కోసం

తిరుపతి పోస్టాఫీస్ సమీపంలోని ఒక సందులో ఉన్న ఇంట్లో సల్మా ముస్తాబవుతున్నారు. ఆమె ఒక సెక్స్ వర్కర్‌. అందరు సెక్స్ వర్కర్లలాగే సల్మా జీవితం కూడా కష్టాలమయమే.

సల్మా ఆమె అసలు పేరు కాదు.

పెళ్లయి భర్త చనిపోయాక నలుగురు పిల్లలు, లక్షల రూపాయల అప్పులతో దిక్కుతోచని స్థితిలో పడిన తనను సొంత చెల్లే ఈ వృత్తిలోకి తెచ్చారని.. బయటపడే దారిలేక, అప్పులు తీర్చడం కోసం ఇందులోనే కొనసాగుతున్నానని సల్మా చెప్పారు.

"అమ్మనాన్నలు చాలా కష్టపడి పెళ్లి చేశారు. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత బతకలేని పరిస్థితిలో మా చెల్లి నన్ను ఈ పనిలోకి తీసుకొచ్చింది. నన్ను ఇందులోకి తెచ్చిన వాళ్లు బాగానే తిన్నారు. నేను మాత్రం బయట పనులు చేసుకుని బతకలేక మళ్లీ ఇదే వృత్తి కొనసాగిస్తూ ఉండిపోయాను. నాకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు తర్వాత అబ్బాయి పుట్టాడు. తర్వాత మళ్లీ ఆడపిల్ల. నలుగురు పిల్లలను పోషించాలి. భర్త లేడు. మా అత్త మామలు కూడా చనిపోయారు" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

భర్త ఒక రోజు ఇంట్లో ఉంటే, మూడు నెలలు పని మీద వేరే ఊళ్లకు వెళ్లేవాడని, పిల్లలకు జ్వరాలు వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి, చివరకు అప్పులు చేయాల్సి వచ్చిందని సల్మా చెప్పారు.

"ఊహ తెలియని వయసులో నాకు పెళ్లి చేశారు. 11 ఏళ్లకు పెద్దమనిషి అయ్యాను. 12 ఏళ్లకే పెళ్లి చేశారు. 13 ఏళ్లకు, 14 ఏళ్లకు ఇద్దరు పాపలు పుట్టారు. నాకు 18 ఏళ్ల వచ్చాక బాబు, 25 ఏళ్లకు మళ్లీ పాప పుట్టింది. నా భర్త ఒక రోజు ఇంట్లో ఉంటే, మూడు నెలలు పనిమీద బయట తిరిగేవాడు. ఇంట్లో ఏమీ ఇచ్చేవాడు కాదు. వారానికి రూ. 300 ఖర్చులకు ఇచ్చేవాడు. దీంతో అప్పులు చేశాను. ఒకరికయితే సమాధానం చెప్పగలను. అప్పుల వాళ్లందరూ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చేసరికి మా చెల్లికి చెప్పాను. తను వెంటనే నన్ను ఈ పని చేయమంది"

international sex workers day
ఫొటో క్యాప్షన్, చెప్పిన మాట వినకపోతే కొడతారని, ఆ దెబ్బలకు శరీరంపై మచ్చలు పడిపోతాయని సల్మా చెప్పారు

'కష్టాల్లో ఉన్న మహిళలను ఈ వృత్తిలోకి దించుతారు'

కష్టాల్లో ఉన్న మహిళలను ఎలా ఈ వృత్తిలోకి లాగుతారో సల్మా చెప్పారు.

మోసపోయాక, తమకు జరిగింది ఎవరికీ చెప్పుకోలేక చాలామంది ఆ కూపంలోనే మగ్గిపోతారని ఆమె చెప్పారు.

"రైల్వే స్టేషన్ దగ్గర, బస్టాండ్ దగ్గర ట్రాప్ చేస్తుంటారు. ఎవరైనా బాధపడుతున్న మహిళలు అక్కడ కూర్చునుంటే, వాళ్ల మాటలు విని ఓదార్చినట్లు మాట్లాడ్డం మొదలుపెడతారు. ఏం కాదు, మేం ఉన్నాం అని తీసుకెళతారు. ఆ తరువాత సెక్స్ వర్క్ చేయిస్తారు. ఒకసారి దిగిన తర్వాత ఇక బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈ వృత్తిలో పెళ్లి కాని వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లు బయటకు వచ్చి ఇలా జరిగిందని తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. ఇంటికి వెళ్లలేక, బయట వేరే పనిచేసుకోలేక ఇరుక్కుపోతారు" అని సల్మా చెప్పారు.

international sex workers day

'కొందరు పోలీసులే సహకరిస్తారు'

దిల్లీ, ముంబయి లాంటి చోట్ల రెడ్ లైట్ ఏరియాల్లో కూడా సెక్స్ వర్కర్‌గా పనిచేశారామె. ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఒకసారి వ్యభిచారంలో చిక్కుకుంటే అక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు.

"దిల్లీలో కొందరు పోలీసులే రెడ్ లైట్ ఏరియా వారికి సహకరిస్తున్నారు. ఆంధ్ర పోలీసులు రైడ్‌కు వస్తున్నారంటే మీ దగ్గర ఉన్న అమ్మాయిల్ని దాచేయమని ముందే వ్యభిచార గృహాలకు సమాచారం ఇస్తారు. అంటే ఒక మనిషి పోతే కోటి రూపాయలు పోయినట్టు వాళ్లకు లెక్క. నైట్ డ్యూటీలకు బయటి పంపిస్తే, వాళ్ల నుంచి తప్పించుకోవచ్చు. కానీ వాళ్లకు నమ్మకం కలగాలి. అప్పుడే బయటికి పంపిస్తారు. అలా వెళ్లినపుడు కూడా చుట్టూ మనుషులను కాపలా పెడతారు. వాళ్లందరి కళ్లు గప్పి తప్పించుకోవాలి."

వ్యభిచారం జరిగే ప్రాంతాలకు రకరకాల వాళ్లు వస్తారని చెప్పారు సల్మా.

"దిల్లీలోని జీబీ రోడ్డులో చాలావరకు వ్యభిచార గృహాలే ఉంటాయి. అక్కడ రోజుకు 20, 30 సార్లు ఈ పని చేయాల్సి వచ్చేది. కానీ, కస్టమర్లు చేతికి రూపాయి ఇవ్వరు. చెప్పినట్లు వినకపోతే నరకం చూపిస్తారు. చెప్పినట్టు చేయకపోతే బ్లేడ్‌తో చేతులు మీద కోసినవారూ ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ కొడతారు. చెప్పలేని ప్రదేశాల్లో కోస్తారు. కొన్నిసార్లు వాళ్లు కొట్టే దెబ్బలకు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. ఏం చెప్పినా కొట్టే చెప్తారు. చెప్పింది చేయకపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వెళ్తారు. మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ వస్తారు. నన్ను ఒకసారి అలాగే కొడితే, నాకు కంటి దగ్గర చీలింది" అని చెప్పారు సల్మా.

బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ వృత్తిలోకి రావడం చూస్తే బాధేస్తుందని, దిల్లీ, ముంబయిలో అలా మోసపోయి వచ్చిన ఎంతోమందిని చూశానని చెప్పారు.

"ఒక మహిళ భర్త మీద అలిగి వచ్చింది. అమ్మ తిట్టిందని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయి కనిపించింది. దిల్లీ జీబి రోడ్డులో ఇలాంటి అమ్మాయిలు కొన్ని వందల మంది కనిపిస్తుంటారు."

sex worker

'మా పిల్లలకు నా వృత్తి గురించి తెలీదు'

గతంలో రోజుకు వెయ్యి రూపాయలు వచ్చినా జీవితం గడిచిపోయేదని, కానీ, ఇప్పుడు ఒక రోజు పని ఉంటే, మరో రోజు ఉండదని, తమ వృత్తిలో కూడా పోటీ పెరిగిందని సల్మా చెబుతున్నారు.

"ఈ వృత్తిలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. వేరే ఏదైనా పని చేసుకుని బతకాలని ఉంది. కానీ, అసలు పూట గడవని పరిస్థితి. డబ్బు దాచిపెట్టి ఉన్న అప్పులు కట్టేసి, నలుగురికీ ఉపయోగపడేలా హాయిగా ఏదైనా అంగడి పెట్టుకుని బతకాలని ఉంది.

ప్రస్తుతం నెలకు రూ. 30 వేలు సంపాదిస్తున్నాను. బయట పనులకు వెళ్తే రూ.10 వేల కంటే ఎక్కువ సంపాదించలేను. అది ఇల్లు గడవడానికి, అప్పులు తీర్చడానికి సరిపోదు" అని అన్నారు.

సల్మాకు రూ.2750 వితంతు పించన్ వస్తోంది. ఈ వృత్తిలో ఉన్నట్లు తన పిల్లలకు కూడా తెలియని చెబుతున్న సల్మా ప్రస్తుతం తిరుపతిలో తన చిన్న కూతురితోపాటు ఉంటున్నారు.

"నా ముగ్గురు పిల్లలకు నేను ఈ పని చేస్తున్నట్లు తెలియదు. చిన్న పాప నా దగ్గరే ఉంటుంది. ఈ పిల్లకు ఇంకా ఊహ తెలియదు. మిగతా ఇద్దరు అమ్మాయిలనూ పది వరకూ చదివించాను. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశాను. బాబు మా అమ్మ దగ్గరే ఉంటున్నాడు. అన్నీ మా అమ్మే చూసుకుంటుంది. భవిష్యత్తులో ఎలాగైనా నా అప్పులు తీరిపోతే చాలు" అన్నారు సల్మా.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)